ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలి
కందనూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పర్యవేక్షణ బృందాలతో డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. గత నెల రోజులుగా తొమ్మిది పర్యవేక్షణ బృందాలు జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని పాఠశాలలో పరిశీలించిన అంశాలను తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి.. రికార్డుల నిర్వహణ, ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్ష విధివిధానాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా తరగతులు జరుగుతున్నాయనే అంశాలను ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పాఠశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి విద్యాప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్‌కుమార్, హెచ్‌ఎంలు వెంకటయ్య, నరహరి, బాలీశ్వర్, నాగరాజు, తనిఖీ బృందాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


