ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి

Feb 7 2026 2:47 PM | Updated on Feb 7 2026 2:47 PM

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి

నాగర్‌కర్నూల్‌: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడ మెడికల్‌ కళాశాల ఎదురుగా ఉన్న నైస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ దేవసహాయంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేసే ప్రతి టేబుల్‌ వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్‌ సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్‌ చొప్పున ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూంలతోపాటు కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. 10న జరగనున్న పోలింగ్‌కు అవసరమైన సామగ్రి పంపిణీని కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డిని ఆదేశించారు. అంతకు ముందు మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయంలో బ్యాలెట్‌ పత్రాలు, ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. బ్యాలెట్‌ పేపర్ల తనిఖీ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. అలాగే రిటర్నింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బ్యాలెట్‌ పేపర్ల తనిఖీని పరిశీలించి, బ్యాలెట్‌ పేపర్లలోని వివరాలు ఫారం–7లో ఉన్న విధంగా ఉన్నాయో లేదో కచ్చితంగా నిర్ధారించుకోవాలని చెప్పారు. ఎలాంటి తప్పులు, సందేహాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులందరికీ కౌంటింగ్‌ నోటీసులు తప్పనిసరిగా జారీ చేసి, ప్రతి ఒక్కరికీ సమాచారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

భూ సేకరణ వేగవంతం చేయండి

జిల్లాలో జాతీయ రహదారి–167కే కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ పరిధిలో ఉన్న భూ సేకరణలో పురోగతి, పరిహారం చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జాతీయ రహదారి, రెవెన్యూ శాఖల అధికారులతో భూ సేకరణ, నిర్మాణ పురోగతి పనులపై కలెక్టర్‌ సమీక్షించి మాట్లాడారు. భూ సేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. రెవెన్యూ జాతీయ రహదారి నిర్మాణ పనుల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులతో మాట్లాడి వారి ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని దేశీఇటికాల భూసేకరణ నోటిఫికేషన్లు, పరిహారం, అవార్డుల ఖరారు వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో భూ సేకరణ అధికారి సత్యనారాయణ, డీఈ రమేష్‌బాబు, ఆర్డీఓలు సురేష్‌, బన్సీలాల్‌, జనార్దన్‌రెడ్డి, కలెక్టరేట్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement