రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి
దోమలపెంట: టీఎస్ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి చేసినట్లు కేంద్రం సీఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్‌ఈ (సివిల్) రవీంద్రకుమార్, ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) ఆదినారాయణతో కలిసి సీఈ కేక్ కట్ చేసి ఇంజినీర్లు, ఉద్యోగులకు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూగర్భ కేంద్రంలో మొదటి యూనిట్ ద్వారా 2001– 02 నుంచి విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒక యూనిట్ చొప్పున సిద్ధం చేస్తూ మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్లతో 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో నిర్మించారని పేర్కొన్నారు. 2020లో కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి నాలుగో యూనిట్ మరమ్మతుకు గురవగా.. ప్రస్తుతం 5 యూనిట్ల ద్వార ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది జెన్‌కో యాజమాన్యం భూగర్భ కేంద్రంకు 1,500 మి.యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా.. 492 టీఎంసీల నీటిని వినియోగించి.. 2,544.22 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామన్నారు. ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం మార్చి 31 కాగా.. ఇంకా 50 రోజులు గడువు ఉందన్నారు. ఇంజినీర్లు, సిబ్బంది అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.


