ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఖరారు

Nov 25 2025 11:00 AM | Updated on Nov 25 2025 11:00 AM

ముహూర

ముహూర్తం ఖరారు

ఆత్మకూర్‌: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ప్రాజెక్టు అయిన ప్రియదర్శిని జూరాల దిగువన హైలెవల్‌ బ్రిడ్జి (వంతెన) నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆత్మకూర్‌ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్ల నిధులతో హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 1న వస్తున్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఈ మేరకు వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి భూమిపూజకు సంబంధించి జూరాల గ్రామం పుష్కర ఘాట్‌ వద్ద, హెలిప్యాడ్‌కు సంబంధించి ఆత్మకూర్‌ జాతర మైదానం స్థలాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు.

రవాణా సౌకర్యం మెరుగు..

ఆత్మకూర్‌ నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్‌ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే సరిపోతోంది. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణించాలి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అనంతరం గద్వాల నుంచి 10 కిలోమీటర్లకు ఆత్మకూర్‌ మీదుగా 14 కిలోమీటర్ల మేర కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. ఫలితంగా 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఏపీలోని ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయంతోపాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతాలకు దూరం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆత్మకూర్‌ మీదుగా 24 గంటలపాటు రవాణా సౌకర్యం కలగనుండడంతో వ్యాపారపరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

జూరాల, కొత్తపల్లి మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం రూ.123 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించగా.. ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసింది. పనుల ప్రారంభానికి గాను గత నెల చివరి వారంలోనే భూమిపూజ జరుగుతుందని ప్రచారం జరిగిన ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో వాయిదా పడింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూమిపూజకు ఆదేశాలు ఇవ్వడంతో డిసెంబర్‌ 1న ముహూర్తం ఖరారు చేయడంతో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

టెండర్ల ప్రక్రియ పూర్తి..

కృష్ణానదిపై జూరాల వద్ద హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణం

గద్వాల– ఆత్మకూర్‌ మధ్య తగ్గనున్న22 కిలోమీటర్ల దూరం

ఇప్పటికే రూ.123 కోట్లు కేటాయింపు.. టెండర్‌ ప్రక్రియ సైతం పూర్తి

రెవెన్యూ డివిజన్‌ దిశగా ఆత్మకూర్‌ అడుగులు

డిసెంబర్‌ 1న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

ముహూర్తం ఖరారు 1
1/1

ముహూర్తం ఖరారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement