చెంచుల అభ్యున్నతికి బీజేపీ కృషి
మన్ననూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసే విధంగా సరి కొత్త పథకాలను అమలు చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలోని ఆదివాసీల ఆవాసాలను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు చెంచులు ఆరాధ్య ధైవంగా కొలిచే హక్కుల వీరుడు బిర్సాముండా జయంతి ఉత్సవాలను ఆదివాసీల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం బీజేపీ తరపున చెంచులకు నిర్మించిన ఇళ్లను పరిశీలించి.. చెంచులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు మన్ననూర్ గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర గిరిజన మోర్చ అధ్యక్షుడు మంగ్యానాయక్, భరత్‌కుమార్, మండలాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు


