ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 31 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహించొద్దన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సమర్థవంతంగా అమలు..
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ వివరించారు. మహిళా సంఘాల్లోని సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల మంజూరు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మహిళా ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్థితి ని మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేకంగా రూ. 9.57కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.


