విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
నాగర్‌కర్నూల్: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమని.. భవిష్యత్‌లో ఉన్నత విద్య, వృత్తిపరమైన జీవితానికి పునాది వంటిదని ఎంపీ డా.మల్లు రవి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి పదో తరగతి విద్యార్థులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఢిల్లీకి చెందిన ఐఐఎఫ్‌ఎస్‌ఎల్ కంపెనీ వితరణ చేసిన స్టడీ మెటీరియల్‌ను నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లోని కీలక భావనలు సులభంగా అర్థమయ్యేలా స్టడీ మెటీరియల్‌ను రూపొందించినట్లు వివరించారు.
● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. ఎంపీ మల్లు రవి ప్రత్యేక చొరవతో సీఎస్‌ఆర్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ స్టడీ మెటీరియల్ అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకొని రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచాలని సూచించారు.
ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. డిజిటల్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, డీసీసీబీ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, కంపెనీ సీఎండీ జయశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.


