మామిడి పూత దశలో సస్యరక్షణ కీలకం
కొల్లాపూర్ రూరల్: మామిడి పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.ఆదిశంకర్ అన్నారు. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల రైతువేదికలో సోమవారం ఉద్యానశాఖ, పాలెం కేవీకే ఆధ్వర్యంలో మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మామిడి పూత, పిందె దశల్లో చేపట్టే యాజమాన్య, సస్యరక్షణ చర్యలతో మంచి దిగుబడిని సాధించవచ్చన్నారు. సకాలంలో మామిడి పూత రాని పక్షంలో 13.0.45 రకం రసాయనిక మందు 10 గ్రాములు, బొరాన్ 1.25 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. అదే విధంగా మామిడి తోటల్లో చీడపీడల నివారణ, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు మామిడి పండ్ల కవర్లను పంపిణీ చేశారు. ప్రసాద్ సీడ్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యానశాఖ డివిజన్ అధికారి లక్ష్మణ్, విజయభాస్కర్‌రెడ్డి, భూపేశ్, సింగిల్‌విండో డైరెక్టర్ రఘుపతిరావు పాల్గొన్నారు.


