శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మూడో వ్యక్తి ప్రమేయం, పైరవీలకు తావు లేకుండా తమ సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 11 ఫిర్యాదులు అందగా.. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
● జిల్లా జడ్జి రమాకాంత్‌ను ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ జిల్లా కోర్టులో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.


