
పులుల మనుగడతోనే అడవుల సంరక్షణ
మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు డివిజన్ ఆధ్వర్యంలో మన్ననూర్‌లోని ఎఫ్‌డీఓ కార్యాలయం అధికారుల సమక్షంలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట డివిజన్ పరిధిలోని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పెద్దపులి బ్యానర్ ప్రదర్శిస్తూ గ్రామంలో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా అడవులను రక్షంచుకుందాం.. పులుల మనుగడతోనే సంరక్షణ.. పుడమికి ఆధారం అనే నినాదాలతో సఫారీ వాహనాలతో ప్రధాన రహదారి వెంట దుర్వాసుల చెరువు చెక్‌పోస్టు వద్దకు ర్యాలీగా వెళ్లారు. అంతకు ముందు తుర్కపల్లి బేస్ క్యాంపు వద్ద మొక్కలు నాటారు. నీటి ఆధారిత ప్రాంతాలతోపాటు ప్రధాన రహదారి వెంట దుర్వాసుల చెరువు నుంచి వటువర్లపల్లి, దోమలపెంట వరకు వన్యప్రాణులకు అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ను సేకరించారు. అలాగే ఏడాది కాలంగా విధుల నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి అడవులు, వన్యప్రాణుల అభివృద్ధి, ప్లాస్టిక్ నివారణకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎఫ్‌డీఓ రామ్మోహన్, ఎఫ్‌ఆర్‌ఓలు వీరేష్, దేవరాజ్, గురుప్రసాద్, మక్బూల్, మహేందర్, ఎఫ్‌ఎస్‌ఓలు, బీఎఫ్‌ఓలు, వాచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవలకు అవార్డు
లింగాల: అటవీ సంరక్షణ, పులుల రక్షణలో చేసిన ఉత్తమ సేవలకు గాను లింగాల అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ ఖాదర్‌పాష ప్రత్యేక అవార్డు అందుకున్నారు. గ్లోబల్ టైగర్ డే–2025 సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బీట్ ఆఫీసర్‌కు అవార్డు ప్రదానం చేశారు. ఎఫ్‌ఆర్వో ఈశ్వర్, సహచర ఉద్యోగులు అవార్డు అందుకున్న బీట్ ఆఫీసర్‌ను అభినందించారు.

పులుల మనుగడతోనే అడవుల సంరక్షణ