
టీచర్లకు తీపికబురు
●
నేటినుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
● ఎస్జీటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎస్‌ఏలుగా అవకాశం
● స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా ప్రమోషన్
● ఉమ్మడి జిల్లాలో 650 నుంచి 750 మందికి మేలు
● ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
నిలిచిన డిప్యూటేషన్లు..
ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంఈఓల నుంచి డిప్యూటేషన్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయుల వివరాలను డీఈఓలు సేకరించారు. వీటికి కలెక్టర్ అనుమతితో ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 680 మందికి డిప్యూటేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్క మహబూబ్‌నగర్‌లోనే 330 మంది బదిలీ కావాలి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం పదోన్నతుల ప్రక్రియను చేపట్టనున్న నేపథ్యంలో డిప్యూటేషన్లు నిలిచిపోయాయి. పదోన్నతుల అనంతరం అక్కడ ఏర్పడిన ఖాళీల ఆధారంగా డిప్యూటేషన్లు చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 11లోగా పూర్తయితే 15లోగా డిప్యూటేషన్లు కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
వివరాలు సేకరిస్తున్నాం..
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. మండల విద్యా శాఖ నుంచి వివిధ కేటగిరీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది సేకరించి పరిశీలిస్తున్నాం. సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేసి ప్రకటిస్తాం. చాలామంది పదవీ విరమణ పొందారు. ఆ వివరాలు సేకరించడంలో కొంత ఆలస్యమవుతుంది. సీనియారిటీతోపాటు ఖాళీలను గుర్తిస్తున్నాం.
– రమేష్‌కుమార్,
జిల్లా విద్యాశాఖ అధికారి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ అచ్చంపేట: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది. గత మూడేళ్ల క్రితమే ప్రమోషన్లు ఇచ్చిన తాజాగా ప్రభుత్వం మరోసారి ప్రక్రియ చేపట్టాలని పేర్కొంటూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,991 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 14,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న పదోన్నతులతో సుమారు 650 నుంచి 750 మంది ఉపాధ్యాయులు అర్హత పొందే అవకాశం ఉందని విద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎస్జీటీలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించనున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా, ఎంఈఓలుగా పదోతున్నతులు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 11 వరకు..
ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల వారీగా డీఈఓ వెబ్‌సైట్‌లలో గ్రేడ్–2 హెడ్‌మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ సమానమైన క్యాడర్ ఖాళీల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంది. వీటితోపాటు గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పదోన్నతులు పొందాల్సిన ఎస్జీటీ ఉపాధ్యాయులు సీనియార్టీ ప్రొవిజనల్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు పొందనున్న ఎస్జీటీల ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ మేరకు సీనియార్టీ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకొనేందుకు ఈ నెల 3న అవకాశం ఉంటుంది. అలాగే 4, 5 తేదీల్లో సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న పదోన్నతులకు అర్హులైన వారు వెబ్‌ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంది. 7న సంబంధిత ఆర్జేడీ, డీఈఓల నుంచి ప్రమోషన్ ఆర్డర్ వెలువడనున్నాయి. ఇలా మొదట హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ప్రక్రియను ఈ నెల 11 వరకు పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..
జిల్లా పాఠశాలలు విద్యార్థులు ఉపాధ్యాయులు
మహబూబ్‌నగర్ 791 62,724 4,650
నాగర్‌కర్నూల్ 808 54,152 3,513
వనపర్తి 495 38,147 2,097
జోగుళాంబ గద్వాల 448 55,289 2,064
నారాయణపేట 458 52,314 1,879

టీచర్లకు తీపికబురు