
నేడు కొల్లాపూర్‌లో డిప్యూటీ సీఎం పర్యటన
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కొల్లాపూర్‌లో పర్యటించి.. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ చేపడుతారని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. ముందుగా ఉదయం 8 గంటలకు భట్టి విక్రమార్క హైదరాబాద్ బేగంపేటలో ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 11 గంటలకు కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావికి చేరుకుంటారన్నారు. అక్కడ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి.. 11.30 గంటలకు వెల్టూరు గ్రామానికి చేరుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం 12.15 గంటలకు కొల్లాపూర్‌కు చేరుకొని పాన్‌గల్, జమ్మాపూర్, మైలారం, వెన్నచెర్ల, మరికల్, మాచుపల్లి, పస్పులలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాల శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. అలాగే పలువురు రైతులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి సోమశిలలో బసచేస్తారు. అక్కడే నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా కొల్లాపూర్‌లోని రాజా బంగ్లా వద్ద కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సభా వేదిక ఏర్పాట్లను స్థానిక నాయకులు పర్యవేక్షించారు.