
10 నుంచి మెగా సర్జికల్ క్యాంపు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఈ నెల 10 నుంచి మూడో విడత మెగా సర్జికల్ క్యాంపు నిర్వహించనున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యాంపులో భాగంగా 12 రకాల శస్త్రచికిత్సలు చేస్తామని, నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. క్యాంపు ఈ నెల 6 నుంచి నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాలతో మార్పు చేశామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు, పేర్లు నమోదు చేసుకోవడానికి వైద్యులు మహేష్ (95539 96060), శార్లీ ఆంటోని (86399 71676)లను సంప్రదించాలని సూచించారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం సముద్ర మట్టానికిపైన 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 1,250 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 841 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వ కు 1,080 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 65 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 763 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
జీవన ప్రమాణాలు
మెరుగుపడాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో కీనోట్ స్పీకర్, సీనియర్ కన్సల్టెంట్ బ్రహ్మ , రిజిస్ట్రార్ రమేష్‌బాబు, మధుసూదన్‌రెడ్డి, అర్జున్‌కుమార్, జావిద్‌ఖాన్, నాగసుధ, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.