
‘వందరోజుల’ ప్రణాళిక పక్కాగా చేపట్టాలి
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో చేపడుతున్న ‘వంద రోజుల’ ప్రత్యేక ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ సంధ్య అధికారులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్న తీరుపై పట్టణమంతా పలుచోట్ల పర్యటించి పరిశీలించారు. పట్టణాల్లో రోజు పోగయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా విభజించి చెత్త సేకరణ ఆటోలకు ఇవ్వాలని, అందుకు అనుగుణంగా మెప్మా సిబ్బంది ప్రతిరోజు అవగాహన కల్పించాలన్నారు. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ గురించి మున్సిపల్ సిబ్బందితో ఆరాతీశారు. తడి, పొడి చెత్తపై కరపత్రాలు, ఆటోల ద్వారా మైక్ అనౌన్స్‌మెంట్, ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. పట్టణంలోని డీఆర్‌ఎసీసీ సెంటర్‌ను పరిశీలించి సేకరించిన చెత్త రీసైక్లింగ్ ప్రక్రియపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ రోడ్డులో ఉన్న బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో చెట్లను నాటి నీరు పోశారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థినులకు 100 రోజుల ప్రణాళిక– స్వచ్ఛ భారత్ అనే అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వార్డు ఆఫీస ర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయి లు వసూలు చేయడంతోపాటు 100 శాతం పన్ను లు వసూలయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి, మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.