
అక్కమహాదేవి గుహలకు టూరిజం బోట్లు తిప్పాలి
దోమలపెంట: బ్రహ్మగిరి (దోమలపెంట) దిగువన ఇన్‌క్‌లైండ్ టన్నెల్ ప్రాంతం నుంచి కృష్ణానదిలోని అక్కమహాదేవి గుహలకు సందర్శకులు రాకపోకలు సాగించడం కోసం టూరిజం బోట్లు తిప్పేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శ్రీశైలంలో జరుగుతున్న వెలమ సంఘం సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారావును గురువారం బ్రహ్మగిరి ప్రాంతంలో ఉన్న పర్యాటక శాఖ అతిథి గృహం హిల్‌టాప్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు మోయిజ్, సిరాజ్, రసూల్, జోషి తదితరులు కలిసి బోట్లు తిప్పాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ పక్క రాష్ట్రం ఏపీ వారు బోట్లు తిప్పుతుంటే మీరెందుకు ఆపారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే బోట్లు తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక నాయకులు మంత్రి జూపల్లితో పాటు వచ్చిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారావును ఘనంగా సన్మానించారు.