
విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కీలకం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో కీలకం అని పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్స్ ప్రతి ఒక్క విభాగంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అందుకోసం విద్యార్థులు పూర్తిస్థాయిలో కంప్యూటర్ విద్యపై దృష్టిసారించాలన్నారు. వీటిద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాయని, పరిశోధన కోణం ఆలోచించే వారికి సృజనాత్మకత ఉండడం వల్ల వారు త్వరగా ఉద్యోగాలు సాధిస్తారన్నారు. ఈ సందర్భంగా అధికారులు సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంవీఎస్ ప్రిన్సిపాల్ పద్మావతి, ఆర్జేడీ యాదగిరి పాల్గొన్నారు.