బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
రేపు మెగా జాబ్ మేళా
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 33 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్టీసీ అభివృద్ధికి కృషిచేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి సిబ్బంది నిరంతరం కృషి చేయాలని డిపో మేనేజర్ యాదయ్య అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమం నిర్వహించి పలువురు సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థకు ప్రతి నెలా ఆదాయం పెంచేలా సిబ్బంది కష్టపడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు సహకారం అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ సరస్వతి, సిబ్బంది శ్రీనివాసులు, బాలస్వామి, పరశురాం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 9 నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు
కందనూలు: జిల్లావ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–2) పరీక్షలు వచ్చే నెల 9 నుంచి 17 వరకు నిర్వహించాలని డీఈఓ రమేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుల నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. బుధవారం నుంచి అన్ని ఎమ్మార్సీల్లో ఎస్‌ఏ–2 ప్రశ్నపత్రాలను తీసుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి.. ఏప్రిల్ 23న ఫలితాలు వెల్లడించాలని, అనంతరం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ కార్డులు అందించాలని సూచించారు. జిల్లాలో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు లక్షకు పైగా విద్యార్థులు చదువుతున్నారని, వీరంతా పరీక్షలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 12 వరకు ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించాలని డీఈఓ సూచించారు.


