సంక్రాంతి సంబురం
కందనూలు/కొల్లాపూర్: ఇల్లిల్లూ పచ్చని తోరణమై.. వాకిళ్లన్నీ రంగులమయం.. గ్రామాలన్నీ జన సందోహంగా.. ఆకాశంలో గాలిపటాల సయ్యాట.. కోడెద్దుల బండలాగుడ్లు.. ఆలయాల్లో భక్తుల రద్దీ వెరసి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబురంలా సాగింది. గురువారం మహిళలు, యువతులు, రంగురంగుల ముత్యాల ముగ్గులు వేశారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి.. వాటిలో నవధాన్యాలు, గరక, రేగుపండ్లు, తంగెడుపూలు పెట్టి పూజలు చేశారు. శుక్రవారం కనుమ సందర్భంగా విందు భోజనాలు, బంధుమిత్రులు, చిన్న, పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగురవేశారు. జిల్లా కేంద్రంలోని రామాలయం, గోవిందక్షేత్రం, సుబ్రహ్మణ్యస్వామి, శ్రీపురం రంగనాయకస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్‌లోని రామాలయం, బండాయిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయం, మాధవస్వామి దేవాలయ భక్త బృంద కమిటీల ఆధ్వర్యంలో ఊరేగింపులు వేర్వేరుగా జరిగాయి. మహిళలు, యువకులు కోలాట ప్రదర్శనలు చేస్తూ, చిన్నారులు దేవతామూర్తుల వేషధారణలో, రైతులు ఎద్దులబండ్లను కట్టి ఉత్సాహంగా గడిపారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ఊరేగింపులో పాల్గొని దేవతామూర్తులను దర్శించుకున్నారు. భజరంగ్‌దళ్ నాయకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
సంక్రాంతి సంబురం


