రమణీయం.. గోదాదేవి కల్యాణం
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో అర్చక బృందం గోదా రంగనాయకస్వామి కల్యాణ క్రతువులు నిర్వహించారు. విశ్వక్‌సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావచనం, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, మంగళాష్టకాలు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మహా సంకల్ప పఠనం, మాంగల్య పూజ, మాంగల్య ధారణ, పూల మార్పిడి, పుష్పయాగం, తలంబ్రాలు, వేద ఆశీర్వచనం వేదమంత్రచ్ఛరణల మధ్య చేశారు. కార్యక్రమంలో అర్చకులు కందాడై శ్రీనివాస ఆచార్యులు, గోమటం మురళీమోహనాచార్యులు, కందాడై గోపాలచార్యులు, చక్రవర్తి శ్రీనివాసచార్యులు పాల్గొన్నారు.
33 మంది ల్యాబ్
టెక్నీషియన్లు నియాకం
నాగర్‌కర్నూల్ క్రైం: స్థానిక జనరల్ ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలకు 33 మంది ల్యాబ్ టెక్నీషియన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2024 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ల నియామకానికి రాత పరీక్ష నిర్వహించగా.. ఉత్తీర్ణత సాధించిన 33 మందిని మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రికి కేటాయించినట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డా.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు శుక్రవారం రిపోర్టు చేశారన్నారు. వీరి చేరికతో ప్రభుత్వ మెడికల్ కళాశాల, జనరల్ ఆస్పత్రిలో రక్త, మూత్ర పరీక్షల సమస్యకు ఇబ్బందులు ఉండవని తెలిపారు.
తెగ తాగేశారు..!
● ఉమ్మడి జిల్లాలో 4 రోజుల్లో
రూ.64.9కోట్ల మద్యం విక్రయాలు
మహబూబ్‌నగర్ క్రైం: సాధారణ రోజుల్లోనే మద్యం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. దానికి తోడు పండుగలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయి. సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 227 మద్యం దుకాణాల్లో నాలుగు రోజుల్లో భారీ స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే మటన్, చికెన్, నాటుకోడి అమ్మకాలు గణనీయంగా జరిగాయి. ప్రధానంగా నగరంలో శుక్రవారం ఉదయం నుంచే రోడ్లపై ప్రత్యేకంగా తాత్కాలికంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుని మటన్, చేపల విక్రయాలు అధికంగా చేశారు. తిమ్మాజిపేట డిపో పరిధిలో రూ.39.9కోట్ల మద్యం, కొత్తకోట డిపో నుంచి రూ.25 కోట్ల వరకు లిఫ్ట్ చేసి దుకాణాలకు తరలించారు.


