ఇంటింటా సంబురం
మార్కెట్లు కిటకిట.. బస్టాండ్లలో రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎటు చూసినా ప్రజల రద్దీనే కనిపించింది. బుధవారం సైతం రంగులు, పతంగులు, కిరాణ దుకాణాల్లో సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు, వివిధ ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు తరలివస్తున్న బస్టాండ్లు కిటకిటలాడాయి. చిన్నారులకు రేగి పండ్లు పోసేందుకు కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. భోగి రోజు నువ్వుల రొట్టెలు ఆరగించేందుకు చిక్కుడు కూర ప్రత్యేకం కావడంతో వాటి ధర అమాంతం పెరిగిపోయింది. తరలివచ్చిన బంధుమిత్రులు, చిన్నారుల పతంగుల ఎగరవేత, యువకుల ఆటల పోటీలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది.
మరింత ఉత్సాహంగా.. కనుమ
సంక్రాంతి పండుగలో చివరి వేడుక కనుమను శుక్రవారం చేసుకుంటారు. పల్లె ప్రాంతాల్లో ఈ పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులతో కలిసి మాంసాహారంతో వంటలు చేసుకుని మద్యం తాగుతూ ఆనందంగా గడుపుతారు. కనుమ రోజు మాంసం విక్రయదారులు, చికెన్ సెంటర్లు తెల్లవారుజాము నుంచే కిటకిటలాడుతాయి. మద్యం దుకాణాలకు ఉదయం నుంచి పొద్దుపోయే దాక తాకిడి ఉంటుంది. కనుమతో సంక్రాంతి పండగ ముగుస్తుంది.
అచ్చంపేట/ కందనూలు: యవత ఆటపాటలు.. కుటుంబీకులంతా కలిసిమెలిసి సరదాగా జరుపుకొనే పండగ సంక్రాంతి. మూడు రోజుల వేడుకలలో భాగంగా.. బుధవారం మొదటిరోజు భోగిని పురస్కరించుకొని భోగిమంటలు వేసుకోగా.. గురువారం రెండోరోజు మకర సంక్రాంతి జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఇళ్ల ముందు వివిధ రకాల రంగులు కలిపి వేసిన ముగ్గులతో లోగిళ్లు సప్తవర్ణాలతో శోభిల్లాయి. ఇక ఏ ఇంట చూసినా తీపి వంటల రుచులు.. ఏ పల్లెలో చూసినా యువకుల ఆటపాటలు, బంధుమిత్రుల రాకలతో సందడిగా కనిపించాయి. ఇక శుక్రవారం మూడోరోజు కనుమ సందర్భంగా పశువులను అలంకరించి వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో సంబరాలు జరుపుకోనున్నారు.
సిరిసంపదలు కలగాలని..
ఏడాదిపాటు తమ ఇళ్లు సిరిసంపదలతో తులతూగాలని పాలు పొంగిస్తారు. రెండు మట్టి కుండలు (గురిగి) అలంకరించి పాలు పోసి బెల్లం వేస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలు, నెయ్యితో మంట వేసి ఆ పాలు పొంగే వరకు మంటపెడతారు. పాలు ఈశాన్యం వైపు పొంగితే ఆ ఇంట సిరిసంపదలకు తావుండదని విశ్వాసం. పాలు పొంగించే సమయంలో కొత్త దుస్తులు, నవధాన్యాలు ఉంచుతారు. ఆ పాలతో కొందరు పొంగళి తయారు చేయగా.. మరికొందరు అలానే వదిలేస్తారు.
‘ధాన్యలక్ష్మి’కి పూజలు
మకర సంక్రాంతి పండుగ ముందు వచ్చే మొదటి అమావాస్య రోజు రైతులు తమ పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి ఘనంగా పండుగ జరుపుకొన్నారు. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో కర్రలతో లక్ష్మీదేవి మండపాలు నిర్మించి ప్రతిష్టించారు. జొన్న అంబలి, ఐదు రకాల కూరగాయలతో తయారు చేసిన ప్రత్యేక బజ్జికూర, భక్షాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి.. ఆవుపేడ పిడకలను మండించి పాలను పొంగించారు. రబీలో పంట బాగా పండాలని మొక్కులు మొక్కారు.
ఇంటింటా సంబురం
ఇంటింటా సంబురం


