కనులపండువగా గోదారంగనాథస్వామి కల్యాణం
కందనూలు/ బిజినేపల్లి/ కొల్లాపూర్: ధనుర్మాసం ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో గోదాదేవి రంగనాథస్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. జిల్లాకేంద్రం శివారులోని పురాతనమైన శ్రీపురం రంగనాథస్వామి, పాలెం వేంకటేశ్వరస్వామి, కొల్లాపూర్‌లోని రామాలయం ఆలయాల్లో ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా, అత్యంత రమణీయంగా కల్యాణ తంతును జరిపించారు. పాలెం వేంకన్న ఆలయంలో ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యుల బృందం శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలా గే శ్రీపురం రంగనాథస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, సరిత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భజనలు, పలక కోలాటాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో వందలాది మంది భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కనులపండువగా గోదారంగనాథస్వామి కల్యాణం
కనులపండువగా గోదారంగనాథస్వామి కల్యాణం


