’పాలమూరు’ అస్త్రంగా..
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలో ఏం మాట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రూ.883 కోట్లతో యూజీడీ, శాశ్వత తాగునీరు..
కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్ లైన్ కాల్వ ఏర్పాటు చేయనున్నారు.
● నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీకి అనుబంధంగా క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా..
మహబూబ్‌నగర్‌లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల..
రూ.200 కోట్లతో మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ కళాశాల భవన నిర్మాణాలకు భూమి పూజ..
రూ.220.94 కోట్లతో మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా పునరుద్ధరణ పనులు..
రూ.603 కోట్లతో కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ
రూ.40 కోట్లతో నర్సింగ్ కాలేజీ భవనం, రూ.20.50 కోట్లతో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన
నేడు మహబూబ్‌నగర్‌కుసీఎం రేవంత్‌రెడ్డి రాక
సుమారు రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ
నగరంలోయూజీడీ, తాగునీటి పనులకు..
ఎంవీఎస్ మైదానంలో బహిరంగ సభ
ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి
’పాలమూరు’ అస్త్రంగా..


