రైతు భరోసా ఏది?
● చివరి దశకు చేరిన యాసంగి పనులు
● పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను
ఆశ్రయిస్తున్న వైనం
నాగర్‌కర్నూల్: పెట్టుబడి సాయం అందించి రైతులు సాగు ఖర్చుల కోసం అప్పులు చేయకుండా ఆదుకునేందుకు 2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే మొదట ఈ పథకం బాగానే ఉన్నా రాన్రాను రైతులకు నిరుపయోగంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు సాగు చేసేముందు ఈ నిధులను ఖాతాల్లో జమచేస్తే సాగుకు వాడుకునే అవకాశం ఉంటుంది. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓటమి చెందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు ఏడాదికి రెండు విడతల్లో రూ.10 వేలు రైతుబంధు ఇస్తుండగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. గత సీజన్‌లో రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయగా ఇటీవలి వానాకాలం సీజన్‌లో మాత్రం ఎకరాకు రూ.12 వేల చొప్పున జమ చేసింది. కాగా యాసంగి సాగు పనులు చివరి దశకు చేరినా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి నెలకొంది.
4,51,974 ఎకరాల్లో పంటలు..
జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 4,51,974 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,82,480 ఎకరాలు, వేరుశనగ 1,32,087 ఎకరాల్లో సాగవుతుందని భావిస్తున్నారు. ఇక మిగిలిన పంటల విషయానికి వస్తే మొక్కజొన్న 1,07,695 ఎకరాలు, మినుములు 20,856, జొన్నలు 2,568, ఇతర పంటలు 13,930 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. కాగా ఇప్పటి వరకు అన్ని పంటలు కలిపి 2,80,718 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. సాగుకు సంబంధించి సాగు ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండటంతో రైతుభరోసా ఖాతాల్లో జమచేస్తే రైతులకు కొంత ఊరట కలగనుంది. కానీ, ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు కూడా ఎలాంటి కసరత్తు ప్రారంభించకపోవడంతో ఇప్పట్లో రైతుభరోసా వచ్చేది సందేహమే. అయితే గతేడాది యాసంగిలో జనవరి నెలలోనే రైతు భరోసాకు సంబంధించిన ప్రకటన వచ్చింది.


