ఉపాధ్యాయ బదిలీలు.. తొలగని నీలినీడలు

- - Sakshi

ఉమ్మడి జిల్లాలో రెండు వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

జీహెచ్‌ఎం, ఎంఈఓ, ఎస్‌ఏలుగా పదోన్నతులు వస్తాయని ఆశలు

జనవరిలో ప్రక్రియ ప్రారంభించినా.. కోర్టు కేసులతో నిలిచిన వైనం

వేసవిసెలవుల్లో పూర్తి చేయాలని డిమాండ్‌

అక్రమ బదిలీలతో అర్హులకు అన్యాయం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌:

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం జనవరి ప్రారంభంలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ ప్రకటించి దరఖాస్తులు సైతం స్వీకరించింది.

బదిలీల్లో స్పౌజ్‌ కేసులు ఉన్న వారికి పాయింట్లు ఎక్కువ ఇవ్వడంతో నాన్‌ స్పౌజ్‌ వారు అన్యాయం జరుగుతోందని కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పడు చేపట్టకపోతే మరో ఏడాది పాటు వేచి ఉండాల్సి వస్తోందన్న వాదనలున్నాయి.

అయిదేళ్ల కిందట ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన బదిలీలు చేపట్టింది. గతేడాది జిల్లాల వారీగా కేడర్‌ విభజన చేశారు. వీటితో పాటు పండిట్‌, పీఈటీల సమస్యలు, 317 అన్యాయం జరిగిన వారు, స్పౌజ్‌ కేసుల సమస్యలు కూడా అలాగే ఉన్నాయి.

అక్రమ బదిలీలు..

ఈ ఏడాది జనవరిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసిన వెంటనే కొందరు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో పైరవీలు చేసి నేరుగా సచివాలయం నుంచి బదిలీ ఆర్డర్లు తీసుకొచ్చి జిల్లాలోని మంచి స్థానాలను ఎంచుకున్నారు.

ఇలాంటి పైరవీలు ఎక్కువగా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 60కి పైగా అక్రమ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువ సర్వీస్‌, ఆరోగ్య సమస్యలు, దివ్యాంగులకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని రద్దు చేయాలన్న వాదలు వినిపిస్తున్నాయి.

ఖాళీలతో సమస్యలు..

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో ఒకసారి పదోన్నతులు చేపట్టారు. పదోన్నతులు చేపట్టి చాలాకాలం కావడంతో వివిధ స్థాయిల్లో పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తుండగా.. 2,032 ఎస్టీటీ, ఎస్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

630 ఎస్‌ఏ పోస్టుల్లో 350 పదోన్నతుల ద్వారా భర్తీ చేసి మిగతావి డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక 68 మండలాలకు ఎంఈఓలను సీనియర్‌ జీహెచ్‌ఎంల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏడుగురు ఎంఈఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే డైట్‌, బీఈడీ కళాశాలల్లో కూడా సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. కానీ వాటిని కూడా భర్తీ చేయడం లేదని తెలుస్తోంది.

విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం..

ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. కొంతకాలంగా ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో విద్యావ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కోర్టు కేసులు ఉన్నందున ప్రమోషన్లు అడహక్‌ పద్ధతిలో ఇవ్వాలి. కోర్టుకేసుల తర్వాత సీనియర్‌లకు న్యాయం జరుగుంది.
– సునీల్‌, జిల్లా అధ్యక్షుడు, తపస్‌

వేసవిలోగా చేపట్టాలి..

8 ఏళుల్గా పదోన్నతులు.. అయిదేళ్లుగా బదిలీలు లేవు. ప్రమోషన్లు లేకపోవడంతో ఏ క్యాడర్‌ వారు ఆ క్యాడర్‌లోనే ఉద్యోగ విరమణ పొందే అవకాశం ఉంది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మధ్యలో నిలిచిపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. సంవత్సరం చివర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే షెడ్యూల్‌ ఇవ్వాలి.
– కృష్ణుడు, రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ ఉపాధ్యాయ సంఘం

Read latest Nagarkurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top