ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..
పరీక్ష కేంద్రాల్లో
అన్ని వసతులు..
● చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
● మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తే
కఠిన చర్యలు
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ రమేశ్‌కుమార్
జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్ అన్నారు. అందులో భాగంగానే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ.. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం డీఈఓతో ‘సాక్షి‘ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వివరించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రతి విద్యార్థి రాణించేలా..
అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు బోధిస్తూ.. గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల సమక్షంలోనే పేపర్లు దిద్ది.. ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలియజేస్తున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నాం. గతేడాది మ్యాథ్స్, ఫిజిక్స్‌లో విద్యార్థులు రాణించలేకపోయారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించడం కోసం గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాం.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
ఈ ఏడాది ప్రతి పరీక్షకు రెండు నుంచి నాలుగు రోజుల సమయం ఉంది. పరీక్ష లేని రోజుల్లో ఏ సబ్జెక్టు టీచర్ ఆ రోజు విద్యార్థులను పాఠశాలలను రప్పించుకొని ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలని ఆదేశించాం. తద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. గతేడాది పదో తరగతి ఫలితాల్లో 13వ స్థానంలో నిలిచాం. ఈసారి కచ్చితంగా టాప్ 10లో సింగిల్ డిజిట్ సాధించడం కోసం కృషి చేస్తున్నాం.
హాజరుకానున్న 10,683 మంది విద్యార్థులు..
జిల్లాలో ఈ ఏడాది 10,683 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో బాలురు 5,264 మంది, బాలికలు 5,394 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 60 కేంద్రాలను ఏర్పాటుచేశాం. 517 మంది ఇన్విజిలేటర్లు, 60 మంది చొప్పున సీఎస్, డీఓలను నియమించాం. అదే విధంగా 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 6 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటుచేశాం. మరో 36 మంది కస్టోడియన్ అధికారులను నియమించాం. సీసీ నిఘాలో పరీక్ష పేపర్ల సీల్ తీయాలి. పరీక్షల నిర్వహణలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడే విద్యార్థులు, ప్రోత్సహించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
విద్యార్థులు పాఠశాలలతో సంబంధం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఈ సారి ఐదు నిమిషాల వెసులుబాటు కల్పించడం జరిగింది. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు తమవంతుగా సహకరించాలి. పరీక్షల సమయంలో పౌష్టికాహారం అందిస్తూ.. సరిపడా నిద్రపోయేలా చూడాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి.
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్‌తో పాటు వైద్యసేవలను అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటికే సంబంధిత అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.


