ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి

Mar 12 2026 8:47 AM | Updated on Mar 12 2026 8:47 AM

లబ్ధిదారులతో గృహప్రవేశం

చేయించేందుకు చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కందనూలు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌, జెడ్పీ సీఈఓ దేవసహాయంతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్‌ ఏఈలతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరైన ఇళ్లలో ప్రారంభమైన నిర్మాణాలు, అవి ఏ దశలో ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్‌ ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 20 నుంచి 26 తేదీ వరకు సంక్షేమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో చివరి దశ నిర్మాణంలో ఉన్న 2,711 ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తిచేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లావ్యాప్తంగా 10,383 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 7,735 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయని.. 2,648 ఇళ్ల నిర్మాణాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్‌ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి.. లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను నేరుగా కలిసి.. వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు సకాలంలో పూర్తిచేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ సంగప్ప, డీపీఓ శ్రీరాములు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement