ఎస్‌ఎస్ తాడ్వాయి: భారతీయ ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని వనవాసీ కల్యాణ పరిషత్ ములుగు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 12, 13వ తేదీల్లో జిల్లాస్థాయి కోయ గిరిజన క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రముఖ్ చౌలం సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీసమ్మక్క బాలుర ఆవాసం మైదానంలో వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల కోయ గిరిజన క్రీడాకారులు 85008 13483, 80749 36448, 89852 36230 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సాయిబాబా సూచించారు.
పోలీసు సేవకు
జాతీయ పురస్కారం
● అతిఉత్కృష్ట సేవా పతకానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేష్ ఎంపిక
వెంకటాపురం(ఎం): తెలంగాణ పోలీసు శాఖలో ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన డి.రమేష్‌కు ప్రతిష్టాత్మక అతిఉత్కృష్ట సేవా పతకం –2026ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 25 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో అంకితభావంతో సేవలందిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించడం విశేషం. వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో రమేష్ కీలకపాత్ర పోషించారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, అటవీ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా చర్యలు, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పించడంలో విశేష కృషిచేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేయడంలోనూ రమేష్ కీలకంగా వ్యవహరించారు. 2010లో ముఖ్యమంత్రి శౌర్య పతకం, 2018లో తెలంగాణ పోలీసు సేవా పతకం, 2024లో ఇండియన్ పోలీస్ మెడల్‌ను ఆయన అందుకున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం రమేష్‌ను వరించింది.
ఎస్‌ఎస్ తాడ్వాయి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పత్తి గోపాల్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు ఆయనకు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ బుధవారం నియామక పత్రం అందజేశారు. కాగా, తన నియామకానికి సహకరించిన వారికి గోపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
దివ్యాంగురాలిపై
బాలుడి అత్యాచారం
● ఆపై నగదు చోరీ
ములుగు రూరల్: దివ్యాంగురాలైన యువతిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై ఇంట్లో నగదు చోరీ చేసిన ఘటన ములుగు పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనినిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన బాలుడు.. తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన యువతిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం, ఇంట్లో ఉన్న సుమారు రూ.4 వేల నగదుతో పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఈ ఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చారు.
న్యాయ సహాయం అందించాలి
భూపాలపల్లి అర్బన్: నిస్సహాయులకు న్యాయ సహాయం అందించడం అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.మహతి వైష్ణవి అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడం సంస్థ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి అఖిల, ప్రభుత్వ ప్లీడర్ సుధాకర్ పాల్గొన్నారు.


