క్రమబద్ధీకరణ పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

క్రమబద్ధీకరణ పేరుతో మోసం

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులను యూనియన్‌ నేతలు మోసం చేసిన సంఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా 350మంది నుంచి రూ.కోటి 80 లక్షల వరకు వసూలు చేయగా, జిల్లాలో 15 మంది బాధితులు ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకులంలో తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అవుతాయన్న ఆశతో అప్పులు చేశామని, పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టామని, భూములు అమ్ముకున్నామని బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎలాది బక్కయ్య, నాగవత్‌ అమర్‌సింగ్‌, వట్టం జగ్గయ్య, ముత్తయ్య కోరారు. ఈ సందర్భంగా వారు తమ గోడును పోలీస్‌ స్టేషన్‌ బయట మీడియాకు బుధవారం వెల్లడించారు. జిల్లాలోని ఏటూరునాగారం పరిధిలోని మూడు గురుకులాలకు చెందిన సుమారు 15 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు బాధితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని నమ్మబలికి తమ వద్ద నుంచి యూనియన్‌ నాయకులు డబ్బులు వసూలు చేశారని చెప్పారు. మూడేళ్లు గడుస్తున్నా క్రమబద్ధీకరించకపోవడంతో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేదని వాపోతున్నారు. ఉద్యోగం పోతుందనే భయంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఐదు నెలల క్రితం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వారు వివరించారు. ఈ వ్యవహారంపై ఐదు నెలల క్రితమే ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర డీజీపీకి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు వినతిపత్రాలు అందించామని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోతున్నారు.

గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్‌,

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి

వసూళ్లకు పాల్పడిన యూనియన్‌ నేతలు

జిల్లాలో 15 మంది బాధితులు

ఐదు నెలల క్రితమే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

క్రమబద్ధీకరణ ఆశ చూపి వసూళ్లు

గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్‌టైం ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ యూనియన్‌ నాయకులు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు క్రమబద్ధీకరణ ఆశ చూపి హైదరాబాద్‌లో 2023లో సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. అనంతరం, కోర్టులో కేసు వేశామంటూ మరో రూ.5 వేల చొప్పున తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 350 మంది ఉద్యోగుల నుంచి రూ.1 కోటి 80 లక్షల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు. మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాకపోవడంతో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యూనియన్‌ నాయకులను కోరగా బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement