ములుగు: ములుగు పట్టణంలోని రామాలయంలో లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనులపండువగా బుధవారం జరిగింది. స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠాపనతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సీతారాముల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠాపన, యంత్రాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన చేశారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ప్రముఖుల పూజలు
ధ్వజస్తంభ, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, డీఎస్పీ రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చంద్రకళ, కౌన్సిలర్లు స్వాతి, పావని తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


