ములుగు: భూముల రీసర్వే ప్రక్రియను రైతులకు ప్రయోజనం కలిగేలా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సీసీఎల్ఏ లోకేష్ కుమార్, గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ.గౌతమ్‌తో కలిసి హైదరాబాద్ నుంచి మంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల రీసర్వే ప్రక్రియ, భూ సమస్యల పరిష్కారం, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్షించారు. ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొని జిల్లాలో భూముల రీసర్వే పురోగతిని మంత్రికి వివరించారు. జిల్లాలో మొత్తం 73 గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 26 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని, మరో 10 గ్రామాల్లో పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్ జీ, ఆర్డీఓ కృష్ణవేణి, ఏఓ అల్లం రాజ్‌కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.


