వెంకటాపురం(కె): మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన గ్రామైక్య సంఘాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయినా వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. నిధులు మంజూరైనా అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో పనులు ఆలస్యం అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
సమావేశాలకు స్థలాలు లేక అవస్థలు
జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల్లో 6,945 స్వయం సహాయక సంఘాలు ఉండగా 340 గ్రామైఖ్య సంఘాలను ఏర్పాటు చేశారు. వీటిలో 70,555 మంది సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రతినెలా సమావేశాలు నిర్వహించుకునేందుకు సరైన వసతులు, భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు జిల్లాకు 169 భవనాలను వీబీజీ రాంజీ పథకం కింద మంజూరయ్యాయి. ఈ మేరకు ఒక్కో భవనానికి రూ.10 లక్షల నిధులు సైతం మంజూరయ్యాయి.
వివిధ దశల్లో భవనాల పనులు
169 గ్రామైఖ్య సంఘాలకు భవనాలను మంజూరు కాగా వీటిలో 30 భవనాల పనులు ప్రారంభం కాలేదు. అలాగే 18 భవనాలకు ముగ్గులు పోసి ఉండగా పిల్లర్ల స్థాయిలో 24 భవనాల పనులు కొనసాగుతున్నాయి. పునాది స్థాయిలో 4 ఉండగా స్లాబ్ లెవల్‌లో 83, బ్రిక్ వర్కులో 9 భవనాల పనులు కొనసాగుతున్నాయి. ఒక భవనం పనులు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. ఈ భవనాల నిర్మాణ పనులు నాలుగు నెలల క్రితం(జూన్ 2) వరకే పనులు పూర్తి చేసి భవనాలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సీతక్క ఆదేశించినా భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని గ్రామైఖ్య సంఘాల సభ్యులు కోరుతున్నారు.
జిల్లాలో 169 గ్రామైక్య సంఘాలకు భవనాలు మంజూరు
నెమ్మదిగా సాగుతున్న నిర్మాణాలు
ఒక్కో భవనానికి రూ.10 లక్షల మంజూరు
అధికారుల పర్యవేక్షణ కరువు


