ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి శ్రీదేవి
ములుగు: వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్రీదేవి కలెక్టర్లకు సూచించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుంచి ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, సాగు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పశుసంవర్థక రంగం వంటి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ మేరకు జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు వీసీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాల్లో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు సమష్టి కృషి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవనాల పైకప్పులపై కూల్ రూఫ్స్ ఏర్పాటుతో ఉష్ణోగ్రతలను తగ్గించడంతో పాటు విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు. అలాగే వ్యవసాయ రంగంలో తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 10 మండలాల పరిధిలో సుమారు 12 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లాలో విద్యుత్ డిమాండ్ 103 మెగావాట్ల నుంచి 243 మెగావాట్లకు పెరిగిందని కలెక్టర్ వివరించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఏఓ సురేశ్కుమార్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అప్పలనాయుడు, విద్యుత్శాఖ ఎస్ఈ భిక్షపతి, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


