● కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ప్రకృతిని ఆరాధిస్తూ, కుటుంబ బంధాలను బలోపేతం చేసే ఈ పూల పండుగ మహిళల కళాత్మకత, ఆత్మీయతకు నిదర్శనమని తెలిపారు. తంగేడు, గునుగు తదితర సహజ పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకలు జరుపుకోవడం తరతరాలుగా వస్తున్న గొప్ప సంప్రదాయమన్నారు. బతుకమ్మ పాటల ద్వారా తెలంగాణ భాష, సంస్కృతిని భావితరాలకు అందించాలని సూచించారు. పండుగ వేళ చెరువులు, జలవనరులను పరిశుభ్రంగా ఉంచాలని, నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బతుకమ్మ, విజయదశమి పండుగలు ప్రజల జీవితాల్లో సంతోషం, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కలెక్టర్ జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.


