● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు శనివారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో హామీలిచ్చి యువతను మోసం చేసిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యువతకు ఇచ్చిన హామీలను నేరవేర్చే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని పత్తిపల్లి రోడ్డు నుంచి తోపుకుంట వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్లాల్, కృష్ణాకర్, శోభన్, నాగరాజు, శ్రీకాంత్, అనిల్, వెంకటేశ్, నవీన్, శ్రీధర్, రతన్‌సింగ్, రమేశ్, శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


