నర్సరీశిక్షణ కేంద్రంలోని 4.30 ఎకరాల్లో మొక్కల పెంపకం
ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలు అధ్వానంగా మారాయి. గిరిజనులకు పండ్ల తోటల పెంపకంపై ఉచిత శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాల్సిన ఉద్యాన నర్సరీలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. గతంలో పండ్లు, పూలతో విరాజిల్లిన గార్డెన్లు ఇప్పుడు చిన్నబోయాయి. వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఐటీడీఏలోని ప్రాజెక్టు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టింగ్ రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నా భర్తీ చేయాల్సిన గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఉద్యాన అధికారులు ఐటీడీఏకు ప్రత్యేక పీహెచ్‌ఓ ఉంటారని, తమకేమి సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఐటీడీఏ పరిధిలోని శిక్షణ కేంద్రం కళావిహీనంగా నిరుపయోగంగా మారిపోయింది.
జిల్లాలోని ఏటూరునాగారం మండల పరిధిలో గల ఐటీడీఏకు చెందిన ఉద్యాన నర్సరీ శిక్షణ కేంద్రంలో గల స్థలంలో ఈ ఏడాది జనవరిలో 4.30 ఎకరాల్లో నిమ్మ, సపోట, టేకు, కొబ్బరి, మల్లె మొక్కల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరిలో పీఓ చిత్రామిశ్రా మొక్కల పెంపకానికి రూ.5లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తోటల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అలాగే నీటి సౌకర్యం కోసం బోరు వేయించి విద్యుత్ మోటారు ఏర్పాటు చేయడంతో పాటు పైపులైన్లు సైతం ఏర్పాటు చేశారు.
అనంతరం పీఓ చిత్రామిశ్రా ఇటీవల బదిలీ కావడంతో ఆ తోటవైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. అయితే 2వేల మొక్కలతో ఏర్పాటు చేసిన మల్లె తోటతో పాటు మిగితా మొక్కలను సంరక్షణకు 15 మంది కూలీలను ఏర్పాటు చేశారు. వీరికి ప్రతిఒక్కరికి ఒక్కో రోజూ రూ.300 చెల్లిస్తున్నారు. అయినా అధికారులు తోటల్లో మాత్రం ఎలాంటి పనులు చేయించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజూ పనులకు వచ్చే కూలీలకు నిజంగానే అధికారులు డబ్బులు ఇస్తున్నారా లేదా వాళ్ల పేర్లు రాసుకుని కాజేస్తున్నారా అనే విమర్శలు వస్తున్నాయి.
మొక్కల పెంపకంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గతంలో ఐటీడీఏలో స్టాస్టికల్ ఆఫీసర్‌గా పనిచేసే సురేశ్‌బాబు మల్లెతోట అభివృద్ధి, నర్సరీల ఏర్పాటును పరిశీలిస్తూ అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి నర్సరీలపై పర్యవేక్షణ కొరవడింది. ఐటీడీఏ అధికారులు నర్సరీల పర్యవేక్షణను గాలికి వదిలేశారు. దీంతో మల్లెతోట ఇప్పుడు పిచ్చిమొక్కల పెంపకం తోటలా మారిపోయింది. ఈ విషయాన్ని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో దృష్టికి తీసుకెళ్లగా ఆ తోటల పనులు, మల్లె తోటల పెంపకాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఉద్యాన నర్సరీలో నాటిన మొక్కల వివరాలు
రూ.5లక్షలు ఖర్చు.. నిర్వహణను పట్టించుకోని అధికారులు
ఐటీడీఏలో రెండేళ్లుగా హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టు ఖాళీ
నిమ్మ 116
సపోట 116
టేకు 250
కొబ్బరి 250
మల్లెలు 2,000


