గోవిందరావుపేట: తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ క్లస్టర్–సి పోటీల్లో చల్వాయి 5వ బెటాలియాన్ టీజీఎస్పీ అధికారులు ప్రతిభ చాటారు. మండల పరిధిలోని చల్వాయిలో గల 5వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ సీవీ.లక్ష్మీకాంతరావు, అసిస్టెంట్ కమాండెంట్ ధర్మారావు క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొని పతకాలు సాధించారు. జీఓఎస్ విభాగంలో కమాండెంట్ లక్ష్మీకాంతరావు ఒక వెండి, రెండు కాంస్య పతకాలు సాధించారు. అలాగే అసిస్టెంట్ కమాండెంట్ ధర్మారావు రెండు కాంస్య పతకాలు సాధించారు. దీంతో క్లస్టర్–సి పోటీల్లో 5వ బెటాలియన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబర్చిన కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్‌లను బెటాలియన్ అధికారులు, సిబ్బంది అభినందించారు.
వయోవృద్ధులు
పిల్లలతో సమానం
ములుగు: వయోవృద్ధులు చిన్న పిల్లలతో సమానమని, వారిలో ఉన్న భావాలు, ఉద్వేగాలు, అలవాట్లను గమనించి నడుచుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవ కార్యక్రమాలల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో వయోవృద్ధులకు వివిధ క్రీడా, పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న వయోవృద్ధులు తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అక్టోబర్ 1న నిర్వహించనున్న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అదేవిధంగా ములుగు జిల్లా పరిషత్ హైస్కూల్, జంగాలపల్లి, బండారుపల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమాలలో వయోవృద్ధుల అనుభవాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు, కష్టసుఖాలు, తమ తరం నాటి మధుర జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో వయోవృద్ధులు సారయ్య, భూమయ్య, శ్యామ్లా నాయక్, సీనియర్ అసిస్టెంట్ నాగేంద్ర, ఎఫ్‌ఆర్‌ఓ గణేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతే లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: కార్యాలయాలు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు ఈ–వేస్ట్‌ను సమర్థవంతంగా వేరుచేసి సక్రమంగా పారవేసేలా చర్యలు చేపట్టాలని ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ క్యాంపెయిన్ 6.0పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. స్పెషల్ క్యాంపెయిన్ 6.0లో భాగంగా అన్ని కార్యాలయాలు, గనులు, పని ప్రదేశాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం రామన్ వి.పాఠక్, ఏజీఎం రవికుమార్, ఏజీఎం జ్యోతి, ఓసీ–2 పీఓ శ్యామ్‌సుందర్, ఓసీ–3 పీఓ రామస్వామి, కేటీకే–1 గ్రూప్ ఏజెంట్ ములుకుంట్ల తిరుపతి, పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.
జాతీయ గుర్తింపు లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: జాతీయ నాణ్యత ప్రణాళిక కార్యక్రమంలో (ఎన్‌క్యూఏఎస్) జాతీయస్థాయి గుర్తింపు సాధించేందుకు జిల్లాలోని 23 పల్లె దవాఖానాలను నామినేట్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లె దవాఖానాల ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య కార్యకర్తలకు ప్రాథమిక ఆరోగ్యసేవలు, ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాలపై శిక్షణ ఇచ్చారు. పల్లె దవాఖానాల్లో ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్యసేవలు అందించడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. జాతీయస్థాయి గు ర్తింపు దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో పీఓలు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ సందీప్, డాక్టర్ నాగరాణి, డీపీఓ చిరంజీవి పాల్గొన్నారు.


