గోవిందరావుపేట: పల్లెటూరి విద్యార్థులు వైద్య విద్యలో సత్తా చాటారు. మండల పరిధిలోని పస్రా గ్రామానికి చెందిన కడారి కార్తీక్, కరిమిళ్ల కాత్యసిరిలు ఎంబీబీఎస్‌లో సీట్లు సాధించి గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. వీరిద్దరూ పదో తరగతి నుంచే ప్రతిభ కనబరుస్తూ చదువులో ముందంజలో ఉండగా.. తాజాగా వైద్య విద్యలో సీట్లు సాధించారు. క్యాతసిరి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించగా కడారి కార్తీక్ సైతం ఎంబీబీఎస్‌లో సీటు సాధించడంతో పలువురు పస్రా గ్రామంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీడీఏ ఏపీఓగా
దామోదరస్వామి
ఏటూరునాగారం: ఐటీడీఏ ఏపీఓగా తిరునగిరి దామోదరస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన పీఓ లెనిన్ వత్సల్ టొప్పోను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఏటూరునాగారం ఏఓగా పనిచేసిన దామోదరస్వామి ఉట్నూరుకు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగోన్నతిపై ఏటూరునాగారం ఏపీఓగా బదిలీ కావడంతో విధుల్లో చేరారు. అయితే ఐటీడీఏలో ఆరు నెలల నుంచి ఏపీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో అభివృద్ధి పథకాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ఏపీఓగా చేరిన దామోదరస్వామి సమస్యలు పరిష్కరిస్తారని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్య ఆస్తులపై
భువన్ సర్వే
ములుగు: మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య ఆస్తుల వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు భువన్ సర్వే నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ములుగు పట్టణంలోని వ్యాపార దుకాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వాణిజ్య భవనాలు, దుకాణాలు, ఇతర వాణిజ్య ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సిపల్ రికార్డులతో సరిపోల్చుతున్నామని తెలిపారు. దుకాణాల ఆస్తి పన్ను అసెస్‌మెంట్‌తో పాటు ట్రేడ్ లైసెనన్స్ ఉందా, దాని చెల్లుబాటు తదితర వివరాలను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను చెల్లించి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ పొందాలని వ్యాపారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారు వెంటనే పొందాలని సూచించారు. భువన్ సర్వే ద్వారా గుర్తించిన వివరాలతో మున్సిపల్ రికార్డులను నవీకరించి, పన్నుల వసూళ్లను మెరుగుపర్చడంతో పాటు మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి.రాజేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రతకు అధిక ప్రాధాన్యం
భూపాలపల్లి అర్బన్: గనుల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయడంతోపాటు ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం ఆక్యుపేషనల్ కోడ్–2020, ఆక్యుపేషనల్ సేప్టీ హెల్త్, వర్కింగ్ కండిషన్స్ సెంట్రల్ రూల్స్–2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి, కార్మికుడి ప్రాణ భద్రత సంస్థకు అత్యంత ముఖ్యమన్నారు. ప్రతీ పని ప్రారంభానికి ముందే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలుచేయాలని, భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనుల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ‘సేఫ్టీ ఫస్ట్’ భావనతో ప్రతీ ఒక్కరు విధులు నిర్వహించాలని, భద్రత అనేది కేవలం సేఫ్టీ విభాగానికే కాకుండా ప్రతీ ఒక్కరి సమష్టి బాధ్యత అని స్పష్టంచేశారు. అంతకు ముందు మొదటి షిఫ్ట్‌లో ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి సేఫ్టీ జీఎం సాయిబాబు 6వ భూగర్భ గనిని సందర్శించారు.


