రామప్పలో సౌత్‌ జోన్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం | - | Sakshi
Sakshi News home page

రామప్పలో సౌత్‌ జోన్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం

Aug 30 2026 1:03 AM | Updated on Aug 30 2026 1:03 AM

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సౌత్‌జోన్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ శనివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో ఈవో ఉమ్మడి భాస్కర్‌ వారిని శాలువాలతో సత్కరించారు. రామప్ప శిల్పకళ సంపద గురించి టూరిజం గైడ్‌ తాడబోయిన వెంకటేశ్‌ వివరించారు.

క్రీడాకారులకు మెరుగైన వసతులు

ములుగు: క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతులు, శిక్షణ సౌకర్యాలు కల్పించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి రామ్మోహన్‌ తెలిపారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్‌ మాట్లాడారు. జిల్లాలో స్టేడియం, అథ్లెటిక్స్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానిరి సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ జగదీశ్‌, కోచ్‌లు సతీష్‌, శ్రీరామ్‌, హుస్సేన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు మదన్‌మోహన్‌, లావణిక, రాజు, ఉపాధ్యాయులు, జూనియర్‌ అసిస్టెంట్‌ లావణ్య కుమారి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలపై

నిరసనలు

ఏటూరునాగారం: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ సెప్టెంబర్‌ 2 నుంచి దశలవారీగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో పార్టీ ములుగు నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ సమావేశంలో ఖరారు చేసిన వెయ్యి రోజుల విఫల పాలన నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ చేపట్టినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలలో ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చలేదని వెల్లడించారు. ప్రజలకు బాకీ ఉన్న హామీలపై సెప్టెంబర్‌లో చేపట్టే వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని కోరారు. నాగజ్యోతితో తనకు ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. ములుగు గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేయడమే లక్ష్యమని వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు యువకులు, కార్యకర్తలు మరింతగా శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), మంగపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

మహాముత్తారం: ఒడిషా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భూపాలపల్లి సీసీఎస్‌, మహాముత్తారం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో కాటారం గ్రామానికి చెందిన దానం శివకృష్ణ పట్టుపడ్డాడు. ఒడిషా నుంచి మేడారం మీదుగా కాటారం వైపు ఆటోలో ప్రయాణిస్తుండగా శివకృష్ణను అనుమానంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement