● వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ములుగు: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్‌ఓలతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో నోటీసుల జారీ, పరిష్కార చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్ధిష్ట గడువులోపు విచారణ చేపట్టాలన్నారు. సంబంధిత రికార్డుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. నోటీసులు అందజేసిన రోజు నుంచి 7 రోజుల గడువు పూర్తయిన అనంతరం విచారణ నిర్వహించాలని సూచించారు. అనామలిస్, నో మ్యాపింగ్ జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని తదితర అంశాలపై వివరించారు. అనంతరం కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో అనామలిస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు సర్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


