మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అత్యంత భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు పవన్‌కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్‌చంద్ రామనుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.


