● 17న కాళేశ్వరం దేవస్థానం
అభివృద్ధి పనుల ప్రారంభం
● షాపింగ్ కాంప్లెక్సు
నిర్వాహకుల ఆందోళన
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధి పనులకు ఈనెల 17న ముహూర్తం ఖరారు కావడంతో భక్తులు, ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం దేవస్థానానికి రూ.198కోట్ల వ్యయంతో రాతి నిర్మాణం పనులు చేపడుతుండగా, ప్రస్తుత గర్భాలయంతో పాటు పలు ఉప ఆలయాల తొలిగింపు ప్రక్రియ జరుగనుంది. దీంతో గర్భాలయంలోని జోడు లింగాలకు తమిళనాడులోని శిల్పులు కొలతలు తీసుకున్నారు. వాటిని యధాస్థితిలో ఉంచి నిర్మాణ సమయంలో ప్రమాదం లేకుండా పైన కప్పులాగా నిర్మించనున్నారు. అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయం ఏర్పాటు కానుందని తెలిసింది. అక్కడే పూజలు నిర్వహణ జరుగుతుందని తెలిసింది. కానీ శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలు ప్రతీ మంగళవారం నిర్వహిస్తారు. శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలు భక్తులు నిర్వహిస్తుంటారు. ఆలయ పునరుద్ధరణ నేపథ్యంలో పూజలు ఎక్కడ నిర్వహిస్తారనేది భక్తుల్లో ఆందోళనలు కలుగుతున్నాయి. కాలసర్ప, శనిపూజలు వీఐపీఘాటులో ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


