యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
ములుగు రూరల్: జిల్లాలో యాసంగి పంటకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం యూరియా నిల్వల వివరాలను వెల్లడించారు. అన్ని సహకార సంఘాల్లోనూ ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంటసాగు చేసిన రైతులకు అందే విధంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ములుగు మండలంలో 137 ఎంటీఎస్, మల్లంపల్లి 68, వెంకటాపురం(ఎం)లో 107, గోవిందరావుపేటలో 40, మంగపేటలో 214, ఎస్‌ఎస్ తాడ్వాయిలో 29, ఏటూరునాగారంలో 46, వాజేడులో 22, వెంకటాపురం(ఎం)లో 126, కన్నాయిగూడెంలో 22 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతులకు యూరియా సరఫరాలో సమస్య ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
రామప్ప తైబందీ ఖరారు
వెంకటాపురం(ఎం) : మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో రైతు వేదికలో రామప్ప సరస్సుకు సంబంధించిన తైబందీని ఖరారు చేసినట్లు నీటి పారుదల శాఖ డీఈ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప సరస్సు ద్వారా యా సంగి సీజన్‌కు సుమారుగా 5,180 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తైబందీ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహాజాతరలో
మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో సమ్మక్క, సారలమ్మ జాతరపై ముందస్తు ప్రణాళికలో భాగంగా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఫస్టు రిఫరల్ సెంటర్‌గా మేడారంంలో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. సెకండ రీలెవల్ ట్రీట్‌మెంట్‌కు ములుగు జనరల్ ఆస్పత్రిలో 20 బెడ్లతో వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. టైర్షరీలెవ్ వైద్యసేవలకు వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పవన్‌కుమార్, ఏడీ గఫర్, డాక్టర్ శ్రీకాంత్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
‘మంత్రి మాటల్లోనే
అభివృద్ధి’
మంగపేట: ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మంత్రి సీతక్క మాటల్లోనే వినిపిస్తుంది తప్పా చేతల్లో ఏమీ కనిపించడం లేదని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు లింగయ్య తండ్రి దశదిన కార్యక్రమానికి బుధవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై గోతులు ఏర్పడినా మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు మరమ్మతులు చేయించలేదన్నారు. మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మేడారం మహాజాతరకు ఈ దారి మీదుగా వేలాది వాహనాల్లో లక్షలాది మంది భక్తులు తల్లుల దర్శనానికి వెళ్తుంటారని తెలిపారు. మహాజాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకునే మంత్రి రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మినారాయణ, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గుడివాడ శ్రీహరి, నాయకులు సుధాకర్, రాజుయాదవ్, శ్రీనివాస్, రాజేందర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు


