శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి
ములుగు రూరల్: జిల్లాలో పోలీస్‌శాఖ నిబద్ధతతో పనిచేసి శాంతిభద్రతలను పరిక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నా రు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్‌శాఖ వార్షిక సమాచార నివేదికను విలేకర్ల సమావేశంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా మావోయి స్టు ప్రభావిత ప్రాంతమైనప్పటికీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసిందని తెలిపారు. 2023లో 1,597 కేసులు, 2024లో 2,171 కేసులు నమోదు అయ్యాయన్నారు. 2025లో 14 శాతం పెరిగిందని తెలిపారు. జిల్లాలోని 10 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 2,472 కేసులు నమోదు అయ్యాయని వె ల్లడించారు. తీవ్రమైన నేరాల విభాగంలో 12 హత్య కేసులు, 8 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగిన నేరాలలో 21 పొక్సో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 18, మిస్సింగ్ కేసులు 127, సెక్షన్ 194 బీఎన్‌ఎస్‌ఎస్ 235 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వివిధ కేసుల్లో రూ.36,99,330 రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. 73 రోడ్డు ప్రమాద కేసుల్లో 77 మంది మృతి చెందగా 152 మంది గాయపడినట్లు వివరించారు. 14 గంజాయి కేసులు నమోదు చేసి 57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ములుగు కోర్టు పరిధిలో నిర్వహించిన లోక్ అదాలత్ లో 1,334 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారయ్యాయని తెలిపారు. వివిధ కేసుల్లో చట్ట ప్రకారం 26మందికి శిక్షపడినట్లు తెలిపారు. జిల్లాలో 87 మంది మావోయిస్టులకు పునారావసం కల్పించినట్లు తెలిపారు. 2025లో 39 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గవర్నర్ బందోబస్తు, మినీ మేడారం జాతర సమయంలో పోలీస్‌శాఖ విశేష సేవలు అందించిందని వివరించారు.
మహాజాతరకు 460 సీసీ కెమెరాలు
మేడారం మహాజాతరకు 12 వేల మంది పోలీసులు విధులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని వివరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 460 సీసీ కెమెరాలు, 20 డ్రోన్ కెమెరాలతో జాతర పర్యవేక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. మేడారం మహా జాతరకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని అందుకు అనుగుణంగా పోలీసు భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారం మనన్‌బట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, డీసీఆర్‌బీ కిశోర్ పాల్గొన్నారు.
మహాజాతరకు 12 వేల మంది పోలీసులు
జిల్లాలో క్రైం రేటు గతేడాది కంటే తగ్గింది
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


