ఫుట్ ఓవర్‌బ్రిడ్జి త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గట్టమ్మ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం గట్టమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం కలెక్టర్ దివాకర, అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్‌జాదవ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి గట్టమ్మ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం వచ్చే భక్తులు మొదటి మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలాలు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆత్మ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కరాటేతో ఆత్మస్థైర్యం
ఏటూరునాగారం: కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కరాటే పోటీల్లో విజేతలను మంత్రి సీతక్క బుధవారం సన్మానించి బహుమతులు అందజేశారు. జిల్లా కరాటే అకాడమి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు పోటీల్లో విజయం సాధించగా బహుమతులను సీతక్క నుంచి అందుకున్నారు. ఈ పోటీల్లో ఐశ్వర్యకు సిల్వర్ మెడల్‌తో పాటు రూ.15వేలు, దినేష్‌కు మెడల్‌తో పాటు రూ.15వేలు, బ్రాంచ్ మెడల్స్ హరిని, హర్ష, రాంచరణ్, అలువాల విఘ్నశ్రీ సాధించగా వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడాకారులను మంత్రి సన్మానించారు. కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బు, కోచ్ హుస్సేన్, క్రీడాకారులు, కోచ్‌లు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క


