
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల పాటు వరుసగా సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 3 వేల మందికి పైగా భక్తుల తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.