
బొగతకు పంపించాలని ఆందోళన
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి తమను పంపించాలని కోరుతూ పర్యాటకులు ఆదివారం అందోళన చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి సుమారుగా 300 మందికి పైగా పర్యాటకులు వాహనాల్లో తరలి వచ్చారు. బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేశామని ప్రవేశం లేదని అక్కడ ఉన్న అటవీశాఖ సిబ్బంది తెలిపారు. సందర్శన నిలిపి వేసిన విషయం తమకు తెలియదని చాలా దూరం నుంచి వచ్చామని పర్యాటకులు సిబ్బందికి తెలిపారు. పర్యాటకులు, సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పర్యాటకులు జాతీయ రహదారిపై తమ వాహనాలను నిలిపి జలపాతం ప్రధాన ద్వారం వద్దకు వెళ్లారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో వాజేడు ఎస్సై జక్కుల సతీశ్‌కు సిబ్బంది సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పర్యాటకులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అధికారులకు సంబంధించిన ఒక వాహనం లోపలి నుంచి బయటకు రావడంతో పర్యాటకులు అక్కడ ఉన్న బొగత సిబ్బందిని నిల దీశారు. ఉన్నతాధికారుల సలహా మేరకు ఎస్సై, అటవీశాఖ సిబ్బంది పర్యాటకులను లోపలికి పంపించారు. పోలీసుల పహారా మధ్యన పర్యాటకులు బొగత జలపాతాన్ని వీక్షించారు.
అటవీశాఖ సిబ్బందితో పర్యాటకుల వాగ్వాదం
పోలీసుల రంగ ప్రవేశం..
ఉన్నతాధికారుల సలహా మేరకు అనుమతి