
యువతకు పెద్దపీట
వెంకటాపురం(ఎం)/ములుగు రూరల్: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నామని, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని జంగేడు స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జాతీయజెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలు శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. స్వాతంత్య్ర సమరయోధులను శాలువాలతో సన్మానించారు. డీఆర్‌డీఏ ద్వారా 492 మహిళా సంఘాలకు 31.50కోట్లను అందించారు. పదో తరగతి, ఇంటర్ టాపర్లకు రూ.10వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించారు. మెప్మా కింద స్వయం సహాయక సంఘాలకు రూ.17.36 కోట్లను అందించారు. ఆనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే దాదాపు 60వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. జిల్లాలో నూతన ఆయిల్‌పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లాకేంద్రంలో మోడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్‌డిపో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సమ్మక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కోసం శాశ్వత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామన్నారు. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్‌సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 2026లో జరగనున్న సమ్మక్క–సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతీ ప్రభుత్వ శాఖను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు.