
ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలి
భూపాలపల్లి అర్బన్: నష్టాల్లో ఉన్న భూపాలపల్లి ఏరియాను లాభాల్లోకి తీసుకురావాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి కోరారు. 79వ స్వాతంత్య్ర వేడుకలను శుక్రవారం ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం సుభాష్‌కాలనీ సింగరేణి కమ్యూనిటీహాల్‌లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. సింగరేణి సెక్యూరిటి సిబ్బందితో గౌరవ వందనం స్వీకరించి వేడుకలను జీఎం ప్రారంభించారు. ఏరియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి కార్మికులకు ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వేడుకలను ఉద్దేశించి జీఎం మాట్లాడారు. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో అనేక దశల్లో నూతన సంస్కరణలు చేటుచేసుకున్నట్లు తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నేతృత్యంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభం, సంక్షేమ కార్యక్రమాల అమలులో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా ఉత్పత్తి లక్ష్యం 72 లక్షల టన్నుల సాధించాల్సి ఉందన్నారు. ఏరియాలో గడిచిన మూడు నెలల్లో 22.5 లక్షల టన్నులు వెలికితీయాల్సి ఉండగా 21.8లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. అధిక వర్షం కారణంగా ఓపెన్‌కాస్టు 2, 3 ప్రాజెక్టులలో అనుకున్న స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోయినట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.331కోట్ల నష్టాల్లో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, గుర్తింపు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి