
పవర్ లిఫ్టర్ వంశీకి మంత్రి ఆర్థిక సాయం
వాజేడు: మండల పరిధిలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన నేషనల్ పవర్ లిఫ్టర్ మొడెం వంశీకి పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క శుక్రవారం ఆర్థిక సాయం చేశారు. అమెరికాలో జరిగే పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.4లక్షలు కావాల్సి ఉండగా వంశీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క రూ.40 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఏటూరునాగారం ఐటీడీఏ నుంచి రూ.లక్ష ఇవ్వాలని పీఓకు సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తొలి స్థానం సంపాదించి రాష్ట్రంతో పాటు జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. తనకు వెన్ను దన్నుగా నిలిచిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పీర్ల కృష్ణబాబు, మంత్రి సీతక్కకు వంశీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.