ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ఆశ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ఆశ డేను పురస్కరించుకుని మంగళవారం మండల పరిధిలోని కొడిశాల పీహెచ్‌సీని సందర్శించి ఆశ కార్యకర్తలతో మాట్లాడారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ లాంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరించి నాలుగో విడత స్క్రీనింగ్ పరీక్షలకు ప్రజలు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని తెలిపారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహార ప్రాముఖ్యతను, సాధారణ ప్రసవాలు, తల్లిపాలు, వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతలను ప్రజలకు వివరించేందుకు ఆశ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా, ప్రతీ ఆశ కార్యకర్త విధిగా తెమడ పరీక్షలు చేయించాలన్నారు. టీబీ నిర్ధారణ అయిన వ్యాధిగ్రస్తులకు మందులను అందజేసి టీబీ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను, ఐవీ ఫ్లూడ్స్, ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారికి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పవన్ కుమార్, సూపర్‌వైజర్లు పద్మ, బాలునాయక్, ఆరోగ్య కార్యకర్త సీతారాం నాయక్, ల్యాబ్ టెక్నీషియన్ పండు, ఫార్మాసిస్టు వెంకట్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న టీ హబ్ పరీక్షల కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ రికార్డులను పరిశీలించారు.


